కరుణానిధి ఇకలేరు

చెన్నై : డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) ఇకలేరు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను.. పార్టీ కార్యకర్తలను శోకసంద్రంలో ముంచుతూ మరలిరాని లోకాలకు తరలిపోయారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి రక్తపోటు తగ్గడంతో గత నెల 28 అళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరుణానిధి కోలుకున్నారని కూడా ప్రకటన చేసినా తిరిగి వయోభారం కారణంగా ఆయన శరీర అవయవాలు చికిత్సకు సహకరించకపోవడంతో మంగళవారం మృతిచెందారు. కావేరీ ఆసుపత్రిలో కరుణ మరణ వార్తను ధృవీకరించగానే ఆ ప్రాంగణమంతా అభిమానుల రోదనలతో మిన్నంటింది. కరుణ మరణాన్ని తట్టుకోలేక గుండెలు బాదుకున్నారు. కరుణ ఇక లేరన్న వార్తతో గుండెలవిసేలా డీఎంకే కార్యకర్తలు రోదిస్తున్నారు. ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కరుణానిధి ప్రస్తానం..
1957 ఏప్రిల్‌ ఒకటిన కుళిత్తలై ఎమ్మెల్యే పదవి చేపట్టి గత ఏడాదితో అరవై ఏళ్లు పూర్తి చేసుకొని వజ్రోత్సవ ఎమ్మెల్యేగా కరుణానిధి పేరు పొందారు. కరుణానిధి తమిళ రాజకీయ నేతల్లో కురువృద్ధుడే కాకుండా కళలు, సాహిత్య రంగాల్లోనూ, తన వాక్పటిమతోను విశేష ఖ్యాతి పొందారు. 1924 జూన్‌ మూడవ తేదీన తిరుక్కువలైలో జన్మించిన ఆయన తన 14వ ఏటనే జస్టిస్‌ పార్టీ ఆకర్షితులై రాజకీయ ప్రవేశం చేశారు. కరుణానిధి తొలిసారి 1957లో కుళిత్తలైలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత వరుస విజయాలను సాధించారు. మొట్టమొదటిగా కుళిత్తలైలో ఎమ్మెల్యేగా గెలుపొంది 1957 ఏప్రిల్‌ ఒకటిన పదవి చేపట్టారు. 55 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగాను, రెండేళ్లు ప్రజాపనుల శాఖ మంత్రిగాను, 18 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ప్రత్యేక స్థానాన్ని పొందడం విశేషం. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరిగా,50 ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, పోటీ చేసిన ప్రతిసారి గెలిచి 13 సార్లు శాసనసభ కు ఎన్నికై ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రాజకీయాల్లో ఎంతో ఖ్యాతి గడించిన వ్యక్తి కరుణానిధి. 1949 లో అన్నాదురై డీఎంకే పార్టీ స్థాపించినప్పుడు డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను,డీఎంకే అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *