తాగుబోతులకు టీటీ24 పెట్టండి..

సాక్షి దినపత్రికను చేతబట్టుకొని మందుబాబుల పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడో మందుబాబు.. పోలీసులు తీసుకున్న నిర్ణయం ఓ మందు బాబును తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఏం చేయాలో తెలియక ఓ వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

మందు బాబు వీడియోలో ఏం చెప్పాడో యధాతతంగా… తాగుబోతులకు ఓ విన్నపం.  తాగుడు మనమే.. దండుగలు(ఫైన్‌) గట్టుడు మనమే. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు ఆర్మీ( ఆర్మ్‌డ్‌ పోలీసులు అయితే ఆర్మీ పోలీసులు అనుకున్నట్టున్నాడు) పోలీసులు కావాలా. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఈసారి  1379(తడబడుతూ తప్పుగా చెప్పారు) మాత్రమే అయ్యాయని బాధపడుతున్నారంట. తాగిపిచ్చుడు వాళ్ల వంతే, కేసులు పెట్టిపించుడు వాళ్ల వంతేనా.

మందు షాపులన్న బంద్‌ చేయండి, తాగుడే ఆపేస్తం. ఒకవేళ తాగితే 108, 104 ఎట్ల పెట్టిండ్రో టీటీ 24 గంటలు పెట్టండి. టీటీ అంటే తెలంగాణ తాగుబోతులకు అంబులెన్స్‌. వీటితో తాగుబోతులను 24 గంటలు ఇంటి దగ్గర దింపేప్రయత్నం చేయాలి. తాగుబోతులం కూడా ఓట్లు వేసేవాళ్లమే కద.. ఏ గవర్నమెంట్‌ వచ్చినా ఓట్ల కోసమే కదా ఇవన్నీ చేసేది.

రెండు రకలుగా మోసపోతున్నాము.. మీరిచ్చే ఉపాధిపనులతో  పొద్దునంతా కష్టపడి అలసిపోయి సాయంత్రం తాగితే కేసులు పెడతారా. వానలు పడుతలేవని టెన్షన్‌లకు కొంత మందిమి తాగుతున్నము. ఇంట్లో బాధలుంటున్నయని మరి కొంత మందిమి తాగుతున్నము. వీటికి మళ్లీ మీరు దండుగలు కట్టించడం ఎంత ధర్మం అని అడుగుతున్నా. 108 అంబులెన్స్‌, గొర్రెలు, బర్రెల పథకాలు ఓట్ల కోసమే కదా. మాకు కూడా ఏమైనా పెట్టండి.  పశువులకంటే హీనంగా తాగి షెటర్‌ దాటంగనే పట్టుకుంటున్నరు. పర్మిట్‌ రూమ్‌లు ఎందుకు పెట్టిండ్రు. తాగడానికే కద. అక్కడికి ఎలా వస్తాము. బండి మీద కాకుండా నడుచుకుంటూ వస్తామా. శంకరం పేట దగ్గరి నుంచి 5 కిమీ.. ఎట్ల రావాలే( వీడియోలో మాట్లాడిన వ్యక్తిది బహుశా శంకరంపేట అనుకుంటా). నడిచొస్తమా.. పర్మిట్‌ రూములైనా తీసెయ్యండి..

ఇది మంచి పద్దతి కాదు..
కేవలం ఎవరో 10 శాతం మంది మాత్రమే మందు తాగుతలేరు. 90 శాతం మంది తాగుతున్నరు.  ప్రతి ఇంటికి పింఛన్‌ ఇస్తున్నరు. మీరిచ్చేది ఒక్కరోజు తాగడానికే సరిపోవడం లేదు. మొత్తం నిషానే దించండి. అప్పుడే మీరు గ్రేట్‌ అని ఒప్పుకుంటము. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ప్రజలకు న్యాయం చేయాలంటే మందు షాపులు బంద్‌ చేయాలె. లేకపోతే మందు షాపులు తెరిచి ఉంటే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ బంద్‌ చేయాలె. ఎందుకంటే రెండు రకాలుగా నాశనం అవుతున్నము. కనీసం పర్మిట్‌ రూమ్‌లు అయినా ఎత్తేయండి. భార్యను బతిమిలాడుకొనైనా ఇంట్లోనే తాగుతం.

ఎట్ల అయినా మేము తాగుడు మానెయ్యం.. కనీ..  తాగుబోతులందరూ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. అయితే చివర్లో మధ్యపానం నిషేదించండి అనే బదులు మద్యపాన నిషేదం ఎత్తేయండి అంటూ స్పీచ్‌ ముగించారు.

అయితే సదరు వ్యక్తి ప్రసంగంలో కొన్ని ఆలోచించే అంశాలు కూడా ఉన్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మందు బాబులంటే కేవలం ఫైన్‌లు వసూలు చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోంది తప్ప .. బాధలు మర్చిపోవాలనే మందు తాగేవారు కూడా ఉంటారని.. అలాంటి వారు డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడితే మరో చిక్కులో చిక్కుకున్నట్టే అవుతోందని.. అందుకే మందు బాబుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *