విజయం ముంగిట.. బోర్లాపడ్డ భారత్‌

బర్మింగ్‌హామ్‌ : చిన్న లక్ష్యం.. క్రీజ్‌లో సెంచరీ హీరో కోహ్లీ, ఆపద సమయాల్లో ఆదుకునే దినేశ్‌ కార్తీక్‌ ఉన్నారు. విజయానికి 84 పరుగులు మాత్రమే అవసరం ఉండటంతో ఇక భారత్‌ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అభిమానులు. కానీ ఇంగ్లాండ్‌ బౌలర్ల దాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు క్యూకట్టారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 110/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా మరో 52 పరుగుల మాత‍్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఇంగ్లాండ్‌ చారిత్రాత్మక 1000వ టెస్టులో విజయం సాధించడమే కాకుండే ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందంజ వేశారు.

తండ్రిని మించిన తనయుడు :
ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో జింబాబ్వేపై భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కపిల్‌డేవ్‌ 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, ఓటమి చెందిన జింబాబ్వే జట్టులో కెవిన్‌ కర్రన్‌ ఆలౌరౌండ్‌ ప్రదర్శనతో(73 & 3/63) అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పుడు జింబాబ్వేతరపును ఆడిన కెవిన్‌ కర్రన్‌ ఎవరో కాదు.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు పొందిన శామ్‌ కర్రన్‌ తండ్రి. అయితే అప్పటి జట్టులో కెప్టెన్‌గా వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇండియాను గెలిపిస్తే, ఇప్పుడు కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌(149 & 51) భారత ఓటమిని నిలువరించలేకపోయింది. ఆనాడు తండ్రి ఆలౌరౌండ్‌ ప్రదర్శన తన జట్టును గెలిపించకపోయినా, కొడుకు శామ్‌ కర్రన్‌ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన(87 & 5/92)తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అంతే కాదు తక్కువ వయస్సులో టెస్ట్‌ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్న ఇంగ్లాండ్‌ ఆటగాడిగా రికార్డు కూడా సృష్టించాడు.

నిండు చెందురుడు ఒకవైపు చుక్కలు ఒక వైపు..


ఈ మ్యాచ్‌లో భారత జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లు కలిసి 214 పరుగులు చేస్తే, ఒక్క కోహ్లీ మాత్రమే 200పరుగులు చేసి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడని నెట్‌ఇంట్లో ప్రశంసలు జల్లు కురుస్తోంది. జట్టు సభ్యులంతా ఒక ఎత్తైతే కోహ్లీ ఒక్కడు మరో ఎత్తు అంటూ భారత్‌ ఓటమి చెందినా కెప్టెన్‌కు అండగా నెటిజన్లు నిలుస్తున్నారు. ‘మ్యాచ్‌ మొత్తం కలిపి ఇరు జట్లు 903 పరుగులు చేస్తే కేవలం కోహ్లీనే 200 పరుగులు చేశాడు. కోహ్లీ ఓ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌. కోహ్లీ చెప్పినట్టు మిగతా బ్యాట్స్‌మెన్‌లు బ్యాట్‌కు పని చెప్పితే సిరీస్‌ను గెలిచే అవకాశం భారత్‌కు లేకపోలేదు’ అని ట్విట్టర్‌లో కైఫ్‌​ పేర్కొన్నారు.

ఇషాంత్‌ శర్మను మందలించిన ఐసీసీ :

రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మను ఐసీసీ మందలించింది. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు మూడోరోజు ఆటలో దురుసు ప్రవర్తన కారణంగా ఇషాంత్‌కు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్ ఇచ్చారు. శుక్రవారం ఆట తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలాన్ ఔటైన అనంతరం ఇషాంత్‌ దురుసుగా ప్రవర్తించాడని అభియోగం నమోదైంది.

క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా :


ఇంగ్లాండ్‌ ఆటగాడు జాయి రూట్‌ క్రీడాస్పూర్తికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో క్లాప్స్‌ కొడుతూ అభినందిస్తూ, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ గెలిచాక హర్దిక్‌కు సానుభూతి తెలిపుతున్న ఫోటోలు నెట్‌ఇంట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *