పూల బాటతో .. మేజర్‌కు వీడ్కొలు

ముంబై : మేజర్‌ కౌస్తుబ్‌ రాణే అమర్‌ రహే.. భారత్‌ మాతాకీ జై .. వందేమాతరం అనే నినాదాలతో మహారాష్ట్రాలోని మీరా రోడ్డులోని శ్మశానవాటిక పరిసరాలన్నీ మారుమోగాయి. మేజర్‌ కౌస్తుబ్‌ వీరమరణం పొందారని తెలిసి ఆయన అంత్యక్రియలలో పాల్గొనేందుకు వేలాది మంది ప్రజలు కౌస్తుబ్‌ రాణే నివాసం వద్దకి చేరుకున్నారు. శీతల్‌ నగర్‌ నుంచి మీరారోడ్డులోని శ్మశాన వాటిక వరకు కొనసాగిన ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణం అర్పించిన మేజర్‌ అంతిమ యాత్ర కోసం రోడ్డు మొత్తం పూలతో పరిచి ప్రజలు తమ అభిమానాన్ని చాటారు. ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చే రోడ్డుకు ఇరువైపులా ఆయనకు శ్రద్ధాంజలి వహించే పోస్టర్లు, బ్యానర్లు నెలకొల్పారు. కౌస్తుబ్‌ రాణే అంతిమయాత్రలో తల్లిదండ్రులతో పాటూ భార్య, రెండున్నరేళ్ల కుమారుడు, సోదరి పాల్గొన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని గురేజ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులతో పారాడుతూ మేజర్‌ కౌస్తుబ్‌ రాణే వీరమరణం పొందారు. ఉగ్రవాదులతో పోరులో ఆయనతో పాటూ మరో ముగ్గురు జవాన్లు అసువులుబాశారు.

కౌస్తుబ్‌ రాణే 1989 ఫిబ్రవరి 27న జన్మించారు. మీరా రోడ్డులోని హోలీ క్రాస్‌ స్కూల్‌ నుంచి ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన ఆయన రావల్‌ కళాశాల నుంచి కళాశాల నుంచి హెచ్‌ఎస్‌సీ, దహిసర్‌లోని శైలేంద్ర కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేసిన అనంతరం పూణే నుంచి ఆర్మీ స్కూల్‌లో చదివారు. ఇలా ఆయన 2011 సెప్టెంబర్‌ 17న ఆర్మీలో చేరారు. ఎంతో ధైర్యశాలి అయిన కౌస్తుబ్‌ ముందుగా లెఫ్టినెంట్‌, కెప్టెన్‌, తర్వాత మేజర్‌గా ఎదిగారు. 2014లో ఆయన కానికాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికిగానూ 2018 జనవరి 26న అధికారులు కౌస్తుబ్‌ను సేనా పథకంతో సత్కరించారు.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన మేజర్‌ కౌస్తుబ్‌ రాణేకు మీరా రోడ్డులోని శ్మశానవాటికలో ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానుల ఆశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఆర్మీ అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. మహారాష్ట్రా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఒక రోజు ముందే కౌస్తుబ్‌ కుటంబ సభ్యులను కలిసి వారికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయనకు తుది వీడ్కోలు పలకడానికి వివిధ ప్రాంతాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

మేజర్‌ సురేంద్ర పూనియా ఫేస్‌బుక్‌ నుంచి మేజర్‌ కౌస్తుబ్‌ రాణే అంతిమయాత్ర వీడియో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *