మేఘా కృష్ణారెడ్డి ఊరిలో బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్

సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా డోకిపర్రుకు వెళ్లారు. ఈ గ్రామంలో ప్రతీయేటా ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బ్రహోత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి బ్రహోత్సవాలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

డోకిపర్రు గ్రామంలోనే మేఘా కృష్ణారెడ్డి జన్మించారు. ఈ ప్రాంతం నుంచే ఆయన అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. మేఘా ఇంజనీరింగ్ నెలకొల్పి దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఉన్న గ్రామాన్ని ఎన్నడూ ఆయన మరువలేదు.

మేఘా కృష్ణారెడ్డి ఆర్థికంగా స్థిరపడ్డాక తన స్వగ్రామం డోకిపర్రును ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశారు. రోడ్లు.. మంచినీటి వసతి.. గ్యాస్‌ సరఫరా తదితర అనేక సదుపాయాలను గ్రామంలో కల్పించారు. అలాగే గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్నితన సొంత ఖర్చులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ప్రతీయేటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మేఘా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్సోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం మేఘా కృష్ణారెడ్డి కుటుంబం ప్రస్తుతం డోకిపర్రులోనే ఉంటున్నారు. బ్రహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈసారి ఉత్సవాల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచింది. నేడు కృష్ణాజిల్లా డోకిపర్రు వేంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన పవన్‌ కళ్యాణ్‌ కు మేఘా కృష్ణారెడ్డి కుటుంబం స్వాగతం పలికింది. పవన్ రాకతో భారీ ఎత్తున జనం తరలిరావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉంటే మేఘా కృష్ణారెడ్డి కట్టించిన ఆలయంలో పూజల కోసం పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్ నుంచి రావడంతో అనేక మంది రాజకీయ ఊహాగానాలకు తెరతీస్తున్నారు. అయితే మేఘా కృష్ణారెడ్డికి చిరంజీవి కుటుంబానికి మధ్య 30ఏళ్ల అనుబంధం ఉంది. వీరవురి కుటుంబాలు కృష్ణా జిల్లాలో పక్కపక్కనే ఉండేవి.

ఈ రెండు ఇళ్ళల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా రెండో కుటుంబం హాజరవుతూ ఉండేది. అదే సాంప్రదాయన్ని ప్రస్తుతం పవన్ కల్యాణ్ కొనసాగించినట్లుగా కన్పిస్తోంది. అంతేతప్ప రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏమిలేవనే అభిప్రాయాన్ని గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా పవన్ రాకతో బ్రహోత్సవాలు మరింత శోభాయమానంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *