ఎంఈఐఎల్ లక్ష్యం: పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనులు 2020 జూన్ చివరి నాటికి పూర్తి

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్‌గా పేరుగాంచిన త్రీ గార్జెస్కు మించిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో అతి తొందరలో సాకారం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అన్నపూర్ణగా మార్చే పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. గడువుకు ముందే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘనకీర్తి కలిగిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఏ దశలో ఏ పనులు చేపట్టాలనే దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందించుకొని పక్కా ప్రణాళికతో గడువుకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంఈఐఎల్ తన శక్తియుక్తులు ఉపయోగిస్తోంది.

ఎన్నో ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలైనా రకరకాల కారణాలతో అది ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగానే ఉంది. పోలవరం దగ్గర విశాలంగా ప్రవాహించే గోదావరిని మళ్లించి అన్నదాతల ఆర్తి తీర్చాలనే సంకల్పం ఏళ్లుగా నెరవేరకుండానే మిగిలిపోయింది. సంక్లిష్టమైన ప్రాజెక్టులు చేపట్టడంలో అపార అనుభవం కలిగిన ఎంఈఐఎల్ ఇప్పుడు రంగంలోకి దిగడంతో పోలవరంలో పనులు ఊపందుకున్నాయి. అత్యంత కీలకమైన కాంక్రీటు పనులు వేగంగా జరుగుతున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణంలో అతి ముఖ్యమైనది కాంక్రీట్ పనులు. 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులు పోలవరంలో చేయాలి. ఇంతటి భారీ పనులను ఏడెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ఎంఈఐఎల్ లక్ష్యంగా విధించుకుంది. దీని కోసం 5 వేల మంది సిబ్బంది అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. భారీ సంఖ్యలో అత్యాధునిక యంత్రాలను కూడా ఎంఈఐఎల్ వినియోగిస్తోంది. వచ్చే ఏడాది జూన్ వరకు ప్రభుత్వం గడువు విధించినా ఏప్రిల్ లోపే పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27న రానున్నారు.

జలాశయంలో అత్యంత ప్రధానమైనది స్పిల్‌వే. ఇందులో 53 బ్లాకులు, ఒక్కొక్క బ్లాకులో 55 మీటర్ల ఎత్తుండే స్పిల్ వే పియర్స్ ఉంటాయి. ఒక్కో బ్లాకులో ఒక మీటరు ఎత్తు కాంక్రీట్ వేయడానికి నాలుగు రోజులు పడుతుంది. భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించిన ఎంఈఐఎల్ సరాసరిన ప్రతీ రోజు 12 బ్లాకుల్లో కాంక్రీట్ పనులు చేపడుతోంది. మొత్తం స్పిల్ వేలో 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాలి. రకరకాల అవాంతరాలు చోటుచేసుకున్నా జనవరి నాటికి25 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తికానున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఎత్తు పెరిగే కొద్ది పనులు క్లిష్టమవుతుంటాయి. దీన్ని అధిగమించేందుకు ఎంఈఐఎల్ అత్యాధునిక యంత్రాలను ఉపయోగిస్తోంది.

సముద్రంలో వృధా అవుతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దశాబ్దాల క్రితం పోలవరం ప్రాజెక్టు ఆలోచన పురుడుపోసుకుంది. రకరకాల కారణాలతో అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఎట్టకేలకు పుష్కరకాలం క్రితం పనులకు శ్రీకారం చుట్టినా అవాంతరాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంఈఐఎల్కు అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గడువు కంటే ముందే ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఎంఈఐఎల్కు పనులు అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దవైన హంద్రీ-నీవా, కాళేశ్వరం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిన ఘనచరిత్ర సంస్థకు ఉంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి కార్యరూపమిస్తూ మేఘా ఇంజినీరింగ్ మెగాస్థాయిలో పోలవరం పనులను ముందుకు తీసుకెళ్తోంది.
రివర్స్ టెండరింగ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులను ఎంఈఐఎల్ దక్కించుకోవడంతో ప్రభుత్వానికి రూ.628 కోట్లు ఆదా కానున్నాయి. నవంబర్లోనే ప్రాజెక్టు పనులను ఎంఈఐఎల్ చేపట్టినా వివిధ సమస్యల వల్ల వేగం పుంజుకోలేదు. గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఒక కారణమైతే, కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా స్పిల్ వే ప్రాంతంలో భారీగా వరద నీరు చేరడం మరో కారణం. వీటికి తోడు వరదలకు రోడ్లు ధ్వంసం కావడంతో పనుల్లో వేగంగా పెంచేందుకు కనీస మౌలిక వసతులు లేకుండా పోయాయి. ముంపు నీటిని తొలగించేందుకు, కొత్త రోడ్లు నిర్మించుకునేందుకు దాదాపు మూడు నెలలు పట్టింది.

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో 1.3 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. అంతే కాదు 80 టీఎంసీల నీటిని కృష్ణా నదిలోకి తరలించే వెసులుబాటు లభిస్తుంది. విశాఖ నగర గృహ, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీరు కూడా అందుతుంది.

జలాశయమంతా ఒక్కటే అయినా అందులో మూడు భాగాలుంటాయి. అవి గ్యాప్, స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. గ్యాపుల్లో 1,2,3 ఉంటాయి. ఇందులో గ్యాప్ 3 అనేది 150 మీటర్ల పొడవుతో కూడిన కాంక్రీట్ డ్యామ్‌గా ఉంటుంది. గ్యాప్ 2లో ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ఉంటుంది. ఇదే ప్రధాన జలశాయం. దీని పొడవు 1.75 కిలోమీటర్లు. గ్యాప్ -1 లోనూ ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ ఉంటుంది. దీని పొడవు 450 మీటర్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పొడవైనా జలాశయం లేదు.
స్పిల్‌వే కాంక్రీట్ పనులను 2020 జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఎంఈఐఎల్ లక్ష్యంగా విధించుకుంది. ఇందులో భాగంగానే ఉండే బీమ్‌లను మే నెలాఖరు నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకుంది. స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జ్ పనులు ఆగస్టు చివరిలోపు పూర్తికావాలి. అంటే ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. స్పిల్ వే చానెల్‌కు సంబంధించిన బ్రిడ్జ్ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ లక్ష్యాలకు అనుగుణంగా డిజైన్ల అనుమతులు తీసుకొని పనుల్లో వేగం పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *