తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం

  • ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
  • కాళేశ్వరంతో సస్యశ్యామలం కానున్న తెలంగాణ
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం
  • సాగునీరు, తాగునీటి సమస్యల నుంచి తెలంగాణకు విముక్తి
  • అద్భుత ప్రాజెక్టులో భాగస్వామిగా నిలిచిన మేఘా ఇంజినీరింగ్
  • కాళేశ్వరంతో మారిపోనున్న తెలంగాణ దశ-దిశ

పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి నాసిక్‌లోని  త్రయంబకేశ్వరుడిని స్పృశిస్తూ తెలంగాణలో బాసర జ్ఞానసరస్వతికి ప్రణమిల్లుతూ గలగలపారుతూ భద్రాద్రిలో శ్రీరామచంద్రుడి పాదాలను తాకుతూ ప్రవహించే గోదావరి ఇప్పుడు దిశ మార్చుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత సంగమ ప్రదేశంలో గోదావరి  ప్రవాహ దిక్కు మారింది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి నీరు పల్లమెరుగన్న మాటకు కాలం చెల్లిందని నిరూపించింది ఇంజినీరింగ్‌ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.

గోదావరి దిశ మార్చిన మేఘా

తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి జలాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలనే సదాశయంతో రూపొందించిన పథకం ఇది. ప్రత్యక్షంగా కొంత ప్రాంతాన్ని, పరోక్షంగా కొంత ప్రాంతాన్ని మొత్తంగా తెలంగాణ అంతటికి నీరందించే ప్రాజెక్టు ఇది. భారీ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేస్తూ సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గోదావరి దిశ మార్చుతూ చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమిక పోషించింది. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ ఉపయోగించని భారీస్థాయి పంపులు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌజుల్లో  ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్‌కు కొత్త భాష్యం చెప్పింది.

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్రమట్టానికి 300 మీటర్ల ఎగువకు నీరు ఎదురు ప్రవహించేలా చేసిన అద్భుతాన్ని  తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది.

మూడేళ్లలో పూర్తి…

ఆంధ్రప్రదేశ్‌లోని  హంద్రీ-నీవా, అమెరికాలోని  కొలరాడో, ఈజిప్టులోని  గ్రేట్‌మ్యాన్‌మేడ్‌ రివర్‌ వంటి వాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులుగా గుర్తింపు ఉంది. కాని వాటి పంపింగ్‌తో పోలిస్తే కాళేశ్వరం తక్కువ సమయంలో వాటికన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోసింది.  ప్రపంచ నీటిపారుదల రంగంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌)  అనితర సాధ్యమైన కృషి ఉంది.  సాంకేతికంగా, విద్యుత్‌పరంగా ఎన్నో సంక్లిష్టతలు ఉన్నా అకుంఠిత దీక్షతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచాన్ని  ఆశ్చర్యపరిచింది మేఘా ఇంజినీరింగ్.

వాస్తవానికి ఇంత భారీస్థాయి ప్రాజెక్టులు పూర్తికావడానికి దశాబ్దాలు పడుతుంది. నాగార్జున సాగర్‌, శ్రీరామ్‌, శ్రీశైలం, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 20 ఏళ్లకు పైగా పట్టింది. అయినా  ఇవి ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదని అందరూ అంగీకరిస్తారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో క్లిష్టమైన పనులు ఎన్నో  ఉన్నప్పటికీ మూడేళ్లలో దాన్ని పూర్తికావడం  అరుదైన విషయం.

రోజుకు రెండు టీఎంసీలు

ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధారణ సాగునీటి ప్రాజెక్టుల్లాగా సులభంగా ఉండదు. అందులోనూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో  భూగర్భంలో పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఉన్నాయి.  సాంకేతిక పనులు, ఇంజినీరింగ్ రంగంలో  ముఫ్పై ఏళ్ల అనుభవం, నైపుణ్యాన్ని రంగరించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో అన్ని సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మేఘా ఇంజినీరింగ్.

రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగల సామర్ధ్యం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెకుకు ఉంది. నీటిని ఎత్తిపోసేందుకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి  పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపులు సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి.  నాలుగు పంపు హౌసులు ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పంపు హౌజుల్లో అతి క్లిష్టమైనది  లక్ష్మీపూర్ గాయత్రి. భూమికి 470 అడుగుల లోతున నిర్మించిన ఈ పంప్ హౌజ్  అన్ని రిజర్వాయర్లలో ఏడాది అంతా నీరు నిల్వ ఉండేలా చూస్తుంది.  జంట సొరంగాలతో కూడిన ఈ పంపు హౌసులో నిర్మించిన  భారీ సర్జ్ పూల్స్ ప్రపంచంలోనే అతి పెద్దవి. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 మోటర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటర్లు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేసిన భారీ మోటర్లు ఇవి. ఒక్కో మోటర్ పంపు బరువు 2376 మెట్రిక్ టన్నులు ఉంటుంది.

సాధారణంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంప్ హౌసులను నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా భూమికి సమానంగా నది ఒడ్డున నిర్మిస్తారు. కాని భూమి లోపల నిర్మించిన గాయత్రి పంప్ హౌస్‌ మాత్రం ఎంతో విశిష్టమైన నిర్మాణం. దీని కోసం 21.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. కిలోల్లో చెప్పాలంటే ఇది కోట్లలో ఉంటుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో…

ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, సలహాలు సూచనలు, ప్రోత్సాహంతో ఈ ఇంజినీరింగ్  అద్భుతాన్ని మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయగలిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.  అంతే కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది.

అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో మేడిగడ్డ నుంచి సిరిసిల్ల వరకు ఇసుకమేటలుగా కనిపించే ప్రదేశమంతా ఇప్పుడు సస్యశ్యామలం కాబోతోంది. గోదావరి దశ-దిశను మార్చయడంలో ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా అద్భుతమైన పాత్ర పోషించింది. దాదాపు 160 కిలోమీటర్లు ఎగువకు ప్రయాణించేలా  గోదావరికి కొత్త నడక నేర్పి నీరు పల్లమెరుగనే సామెతను తిరగరాసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *