అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్న ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు

ఏపీ సీఎం జగన్ గద్దెనెక్కగానే కేంద్ర సర్వీసుల్లో ఉన్న స్టిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులును ఏరికోరి రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకొచ్చి రవాణాశాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీ పోస్టులను కట్టబెట్టారు. సింగం లాంటి పోలీస్ ఆఫీసర్ అయిన ఐపీఎస్ సీతారామాంజనేయులు తనదైన మార్క్ ను కొద్దిరోజుల్లోనే చూపించారు. సీతారామాంజనేయులు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా తన సత్తా చాటారు. అవినీతి లేకుండా చేశారు. ప్రయివేటు ట్రావెల్స్ దందాని కట్టడి చేశారు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడి నుంచి కూడా రివకరీ చేయగలిగారు. జేసీ దివాకరరెడ్డి వంటి నాయకుడికి ఎదురెళ్లి నిలిచారు. దీంతో ఆయన పనితీరు నచ్చి జగన్ ఏకంగా ఆయనకు ఏసీబీ డీజీగా నియమించారు. అవినీతి రహిత పాలన అందించే లక్ష్యంతో గద్దెనెక్కిన జగన్ తన లక్ష్య సాధనకు సీతారామాంజనేయులు ఇప్పుడు ఆయుధంగా వాడేస్తున్నారు.

తాజాగా సీఎం జగన్ రెవెన్యూశాఖపై వస్తున్న ఫిర్యాదులు, అవినీతిపై సీరియస్ అయ్యారు. ఏపీ రెవెన్యూ శాఖ అవినీతితో భ్రష్టుపట్టిందని భావించి దాన్ని పారద్రోలడానికి పూనుకున్నారు. ఈ బాధ్యతను ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులుకు అప్పగించారు. ఇటీవలే ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేయించి ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు బెంబేలెత్తించారు. ఏపీలో అవినీతికి ఆలవాలంగా మారిన రెవెన్యూ అవినీతిపై ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు అధికారవర్గాల్లో కలకలం రేపాయి.

తాజాగా ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు ఏపీలోని అవినీతి అధికారులపై పడ్డారు. జలగల్లా ప్రజలను దోచుకుతింటున్న అధికారులపై ఏసీబీ దాడులకు ఈరోజు దిగారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లలో రాష్ట్రంలో పలు చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం ఐటిడిఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ టి. మోహన్ రావు, ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. వీరేకాదు.. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, సూపరిటెండెంట్ శ్రీ గంధం వెంకట పల్లం రాజు.. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామ పి.ఎ.సిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ శ్రీ సీరం రెడ్డి గోవిందు , తూర్పు గోదావరి జిల్లా సీఈవో ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్, కాకినాడ శ్రీ లంకె రఘు బాబు.. కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్, పి. ఎ. టు స్పెషల్ కలెక్టర్ శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీ సాకే సత్యం.. నివాసాలపై వీరి బంధువులు బినామీల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. 25 ఏసీబీ బృందాలు దాడులు జరుపుతున్నారు. భారీగా ఆస్తులు, నగలు, నగదు గుర్తించారు.

ఇలా రవాణా శాఖయే కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఇలా అన్ని శాఖలపై పడి ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు ఏపీ అవినీతిపై శివాలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీలోని అత్యంత అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోతున్నారు. జగన్ ఆదేశాలతో ఏపీలో అవినీతిని అరికడుతున్న ఏసీబీ డీజీ తీరు సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *