తెలంగాణ భగత్‌ సింగ్‌.. అనభేరి

చదువుకొని ఉన్నత స్థానాలకు పోయినోళ్లను, ప్రపంచ కుభేరులుగా మారిన వాళ్లను చూసినం. విద్య నేర్పిన విజ్ఙానాన్ని డబ్బు కోసమో లేక అధికారం కోసమో వాడకుండా ఉన్నదంతా ప్రజలకే ఊడ్చిపెట్టి, ఆఖరికి ప్రజల కోసమే ప్రాణ త్యాగం చేసిన వాళ్లను మాత్రం అత్యంత అరుదుగా చూస్తుంటాం. 100 తరాలు కూసొని తిన్నా ఒడువనంత ఆస్తి. ఇంటి పేరు చెబితేనే సుట్టూ ఊర్ల జనం అంతా వంగి వంగి దండాలు పెట్టే దొరల కుటుంబంలో పుట్టిండు. చదువు నేర్పిన సంస్కారంతో దొరతనం ఒదిలిండు. సాటి మనిషిని మనస్సుతో చూసిండు. కొందరి చావు చరిత్రకు ప్రాణం పోస్తది.. త్యాగానికి చిరునామగా నిలుస్తది. తెలంగాణ భగత్‌ సింగ్‌ అనభేరి ప్రభాకర్‌ రావు చేసిన రణభేరి గురించి ఆయన జయంతి సందర్భంగా..

అనుభవించాడనికి అన్ని ఉన్నా మనసులో చదువు రగిలించిన జ్వాల పేదలకోసం సాయుధ పోరాటం దిశగా అడుగులు వేసేలా చేసింది. 1910 ఆగష్టు 15వ తేదిన కరీంనగర్ జిల్లా పోలంపల్లికి చెందిన జమిందార్ అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధా దేవిలకు అనభేరి ప్రభాకర్ రావు రెండో సంతానంగా జన్మించిండు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య తరువాత మచిలీపట్నంలో కొంతకాలం చదివి తరువాత, హైదరాబాద్ చాదర్‌ఘాట్ హైస్కూల్, బెనారస్ కాశీ విద్యాపీఠ్‌లో ఉన్నత విద్యను అభ్యసించిండు. స్వతహాగా ఆదర్శ భావాలు కలిగిన ఆయన విద్యార్థి దశ నుంచే నిజాం వ్యతిరేక ఉద్యమం వైపు అడుగులు వేసిండు. ఇంకా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా అనభేరి వెళ్ళలేదు, అందరు దొరల కొడుకుల్లాగా దొరతనాన్ని ఎంచుకోలేదు. విలాసవంతమైన జీవితం వైపు అనభేరి మొగ్గు చూపలేదు. ఆడంబరమైన జమిందారీ అధికారాలకి ఆకర్షితులవ్వలేదు. గుండెల పుట్టిన మంట గూట్లే ఉండనియ్యదంటరు. కడుపుల సల్ల కదలకుండ సుఖపడే ఇంట్ల పుట్టినా.. గుండెలో చదువు నేర్పించిన స్వేచ్ఛా నినాదం అనభేరిని కుదురుగా ఉండనియ్యలేదు.

అనభేరికి 27 ఏళ్ల వయసులో అప్పటి చెన్నూర్ తహసీల్దార్ వెల్ముల నారాయణ రావు, లక్ష్మీనర్సుభాయి చిన్న కుమార్తె సరళా దేవితో పెళ్లి అయింది. సరళా దేవి అనభేరి గురించి విని ఆయన ఆదర్శాలకు ఆకర్షితురాలై ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆయనకు భార్య అవడమే కాకుండా ఆ కాలంలో 8వ తరగతి వరకు చదువుకొన్న ఆమె అనభేరికి అన్ని విధాల సహకరించేవారు. భర్తతో పాటు మీటింగుల్లోనూ, సభల్లోనూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, సమావేశాల్లో వీరిద్దరూ పాటల రూపంలో ప్రజలను ఉత్తేజపరచేవారు. తమ ఇంటికీ వచ్చే లెక్కలేనంత మంది పార్టీ కార్యకర్తలకి అన్నపూర్ణమ్మలా స్వయంగా పనివాళ్ళ సాయం లేకుండా భోజనాలు సమకూర్చేవారు. జనానికి స్ఫూర్తి ప్రభాకర్ రావు గారైతే ఆయన స్ఫూర్తికి మూలం సరళాదేవి అయ్యారు.

1938లో ఆంధ్ర మహాసభకి జిల్లా సెక్రెటరీగా పని చేసిన అనభేరి హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభ ప్లీనరీలో ప్రముఖ పాత్ర పోషించిండు. తాను ధనిక, పెత్తందారీ వర్గానికి చెందిన వాడినని, పేద ప్రజలు తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్లని ఆయన అందరు దొరల్లాగ ఆలోచించ లేదు. తాను తినే పంచభక్ష్య పరమాన్నాల్లో ఆయనకు పేదవాడి రక్తం, ఆకలి కనిపించింది. పట్టు పరుపుల మీద పడుకునే ఆయనకు పేదవాడి అప్పుల సెగ తగిలింది. తన చుట్టూ ఉన్న దాసీలలో కనిపించని స్త్రీ జాతి సంకెళ్ళు ఆయనను కదిలించినయి. పాలేర్ల వెట్టి బ్రతుకుల్లోని భారం ఆయన వెన్ను తట్టింది. ఆదర్శమూర్తైన ప్రభాకర్ రావు ఇంటి నుంచే తన ఆదర్శాలను అమలు చేసిండు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించిండు. తమ ఇంట్లోని దాసీలకు పెళ్లిళ్లు చేసి పంపించడమే కాకుండా వారికి ఇండ్లు కట్టించి ఇచ్చి, వాళ్ళ దాస్య శృంఖలాలను తెంచేసి, వాళ్ళ జీవితాల్లో స్వేచ్చా వెలుగులు నింపిండు. స్త్రీ జాతికి గౌరవాన్ని అందచేసి మహా పురుషుడయ్యిండు అనభేరి. ఆర్య సమాజ్‌ సిద్ధాంతాలను ఆచరించి ఇంట్లో అందరితో ఆచరింప చేసిండు. మాంసంతో పాటు మద్యాన్ని కూడా నిషేదింపచేసిండు. ప్రతి దసరాకి తమ జమిందారీకి 66 ఊర్ల నుండి వెట్టిగా/కానుకగా వచ్చే గొర్రె పిల్లలను మానిపించిండు.

ఆ రోజుల్లో రజాకార్ల అమానుషత్వానికి గురౌతున్న ప్రజల బ్రతుకులు అనభేరిని కదిలించినయి. ప్రజలకు చదువు నేర్పి వాళ్ళను చైతన్యవంతులను చేయడానికి ఆయన కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో వయోజనుల కోసం నైట్ స్కూల్‌ను ఏర్పాటు చేసిండు. ఊర్లో ధాన్యం దొరకక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ప్రభాకర్ రావు గ్రెయిన్ బ్యాంకు నెలకొల్పి రైతులకు విత్తనాలను, ధాన్యాలను అందచేసేవాడు. రైతులను చైతన్య పరచేందుకు రైతు మహాసభలు నిర్వహించి, ఎంతోమంది అన్నదాతలను ఆదుకున్నడు.

నూలు దొరకక, మగ్గం ఆడక బ్రతుకులు సతమతమవుతున్న నేతన్నలను ఆదుకోవడానికి ఊర్లలో సహకార సంఘాలు స్థాపించి హైదరాబాద్‌ కమిషనర్ నుండి పెట్టెల్లో నూలు తెచ్చి, చేనేత కార్మికులకు రేషన్ కార్డులు ఇప్పించి వాటి ద్వారా నూలు అందించేవాడు. అప్పుడు సిరిసిల్ల సెంటర్‌గా ఉండేది. ఇలా ప్రభాకర్ రావు దాదాపు 40 వేల మందికి రేషన్ కార్డ్స్‌ ఇప్పించిండు. అనభేరి 1942 నుండి 1946 వరకూ 5 సంవత్సరాలు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి ఆయన ఎంతో మంది చేనేత కార్మికులను ఆకలి చావుల నుండి తప్పించి వారికి ఒక కొత్త జీవితాన్ని ఏర్పాటు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిండు.

భారత కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా నుండి మొదటి వ్యక్తిగా నాయకత్వం వహించిండు. సాయుధ పోరాటంలో భాగంగా వందలాది మందితో ఏర్పడ్డ దళానికి అనభేరి నాయకత్వం వహించి ఆదిలాబాద్, విజయవాడ, సిర్వంచ, చాందా, కరీంనగర్ దళాలకు సహచరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డితో కలసి శిక్షణ ఇచ్చిండు. 40 గ్రామాల్లో పటేల్ పట్వారీల వ్యవస్థకి వ్యతిరేకంగా దాడి చేసి దాస్తావేజుల్ని కాల్చివేయడం ద్వారా రైతుల అప్పు పత్రాల్ని, దొంగ పట్టాలు, భూమి పత్రాల్ని ఇతర పన్ను పత్రాల్ని కాల్చివేసి పెత్తందార్ల అమానుషత్వానికి గురౌతున్న పేద రైతులను కాపాడి వాళ్లను శాప విముక్తుల్ని చేసిండు అనభేరి. ఆయన నాయకత్వంలో సాయుధ పోరాటం ఒక కొత్త దిశగా మలుపు తిరిగింది. గ్రామాల్లో పడి ఇళ్ళను కాల్చి వేసి, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడుతున్న రజాకార్లను తమ దళంతో తరిమికొట్టి ప్రజల ప్రాణాల్ని స్త్రీల గౌరవాన్నిఆయన కాపాడిండు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చేనేత కార్మికులకు లేని రేషన్ ఇప్పిస్తున్నాడని, అప్పటి తాలుక్దార్ బాకూర్ హుస్సేన్ అనభేరికి ఎన్నోసార్లు వారంట్లు జారీ చేసిన ఆయన బెదరలేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అనభేరి కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు ఆయనకు తాలుక్దార్ పదవిని ప్రభుత్వం ఆశ చూపించింది. కానీ తన ఆస్థిని, వతన్లను, హోదాను ప్రజల కోసం త్యాగం చేసిన అనభేరి ముందు నిజాం ప్రభుత్వం ఆయనకు ఎరగా చూపిన తలుక్దార్ పదవి గడ్డి పోచ అయింది. అనభేరి లొంగకపోవడంతో ప్రభుత్వం ఆయన సభలను నిషేధించింది. ప్రభాకర్ రావుపై నజార్బంద్ జారీ చేయడంతో అనభేరి అజ్ఞాతంలోకి పోవలసి వచ్చింది. అరచేయి అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో అలాగే అనభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేక పోయింది. భగ భగ మండే ప్రభాకరుడే అయ్యారు అనభేరి. (పెత్తందార్లు తమ ఆటలు సాగక అనభేరిని అడ్డు తొలగించడానికి, నిజాం ప్రభువుకు బంగారు కుర్చీ నజరానాగా ఇచ్చారని ఒక వదంతి కూడా ఉంది).

నిజాంకు సింహస్వప్నంలా మారిన అనభేరిని పట్టించిన వారికి 50 వేల రూపాయల బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. కానీ, పేద ప్రజలు సైతం ఆ డబ్బులకు లొంగలేదు. ఆయన ఎలా ఉంటారో తెలియక పోవడంతో నైజాం పోలీసులు నేనే అనభేరి అంటూ ముందుకు వచ్చిన వారిని కాల్చివేయ సాగారు. తమ దేవుడిలా చూసుకొనే అనభేరిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు డబ్బుల్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి ముందుకు వచ్చారు. 1948 మార్చి14న నిజాం ప్రభుత్వంతో కుమ్ముక్కైన మహ్మదాపూర్ పోలిస్ పటేల్ కుట్రతో అనభేరి దళాన్నిభోజనానికి పిలిచి రజాకార్లకు సమాచారం అందించాడు.

ఒక్కసారిగా రజాకార్లు దాడి చేయడంతో అనభేరి ఊర్లో వాళ్లకు ప్రాణాపాయం ఉండకూడదని, తమ దళంతో గుట్టల వైపు పరుగెత్తిండు. అనభేరికి తప్పించుకొనే అవకాశం ఉండి కూడా అప్పటికే తన కోసం ఎంతోమంది ప్రజలు ప్రాణ త్యాగానికి సిద్దం అవుతున్నారని, భరించలేక రజాకార్లతో యుద్దానికే సిద్దం అయ్యిండు. తన స్టెన్ గన్తో ఫైరింగ్ చేస్తూ ఎంతో మంది రజాకార్లని మట్టి కరిపించిన ఆయన తన ఫ్రెండ్ భూపతి రెడ్డి గాయపడడంతో ఆయనకు ఒక చేత్తో బ్యాండేజ్ చేస్తూ మరో చేత్తో ఫైరింగ్ చేయసాగాడు. అవకాశం చూసి రజాకార్లు అనభేరిపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. గాయపడ్డ అనభేరిని రజాకార్లు నీళ్లు ఇచ్చి దావఖానాకు తీసుకుపోతం అన్నా కూడా ఆయన వాళ్లిచ్చిన నీరు తాగడానికి కానీ, ఆసుపత్రికి పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ ఇష్టపడలేదు. రజాకార్లతో పోరాటంలో అనభేరితో పాటు మరో 12 మంది ఉద్యమకారులు వీరమరణం పొందారు. అనభేరి ప్రభాకర్ రావు మరణం రజాకార్లు.. నిజాం సైన్యానికి కొండంత సంతోషాన్నిచ్చింది. చనిపోయిన తర్వాత ఆయన కోటును కట్టెకు చుట్టి ”షేర్ మర్ గయా ” అంటూ రజాకార్లు అక్కడి ఊర్లన్ని తిరుగుతూ నినాదాలు చేశారు.

అనభేరి మరణంతో ఒక్కసారిగా తెలంగాణ అంతా భగ్గుమంది. ప్రతి ఊర్లోను యువకులు, స్త్రీలు దళాలుగా ఏర్పడి ఉద్యమించారు. ఫలితంగా ఆయన మరణించిన ఆరు నెలల్లోపే తెలంగాణ చెర వీడింది. అనేక మంది ఉద్యమకారులు యేండ్లకొద్ది అనభేరి ప్రభాకర్ రావు స్పూర్తిగా ఉద్యమం కొనసాగించారంటే అనభేరి ఉద్యమం ప్రజల్లో ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉద్యమకారులంతా అనభేరి గుర్తుగా గ్రామంలోని గుట్టవద్ద అనభేరి సమాధిని నిర్మించారు. ఇక్కడే ప్రతియేడు అనభేరి జయంతి , వర్థంతులను నిర్వహిస్తున్నారు.

3 thoughts on “తెలంగాణ భగత్‌ సింగ్‌.. అనభేరి

  1. ఎం లేని వాళ్ళు ఉద్యమాల బాట పట్టడం చూస్తుంటాం.. కానీ అన్ని ఉండి ఉద్యమాల బాట పట్టడం అరుదుగా చూస్తుంటాం.. అలాంటి ఆణిముత్యం గురించి తెలుసుకోవడం చాలా ఆనందంా ఉంది..నెట్ ఇల్లు కి నా ధన్యవాదాలు

  2. I am regular reader, how are you everybody? This piece of writing posted at this site is
    really nice.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *