తన బర్త్ డేకి కోటి విరాళం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

ఈ మధ్యకాలంలో మధ్యతరగతి వారు కూడా బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఆ హంగు, ఆర్భాటాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఎమ్మెల్యేను సంతృప్తి పరచడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు విరాళాలిస్తుంటారు. ఇక అనుచరులు వివిధ ఆశావహుల ద్వారా భారీగానే వసూలు చేసి.. వాటన్నింటితో ఎమ్మెల్యేగారి బర్త్ డే అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇప్పుడే ఇలానే తన బర్త్ డే వేడుకలకు ఏకంగా కోటి రూపాయలు వసూలు చేశాడో ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈయన పుట్టిన రోజు వేడుక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

అధికార పార్టీ ఎమ్మెల్యే మరీ. అందుకే ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు విరాళాలు, భారీ కానుకలు వెల్లువెత్తాయట.. అయితే అవన్నీ జనాలు, వివిధ వర్గాల వారు ప్రేమతో ఇచ్చినవి అనుకుంటే పొరపాటే.. అవన్నీ బలవంతపు వసూళ్లేనట.. ప్రతీ ప్రభుత్వ శాఖ నుంచి, ప్రజలు, వివిధ పారిశ్రామిక, వ్యాపార, మైనింగ్ సహా ఇలా అన్ని వర్గాల నుంచి ఇంత అంటూ భారీ మొత్తాలు రాంబాబుకు కానుకగా వచ్చాయట.. ఇదంతా ఎమ్మెల్యేగారి బర్త్ డే సందర్భంగా ఆయన అనుచరులు ముక్కుపిండిన వసూలు చేసిన సొమ్మేనట. అది ఎంతనుకుంటారు.. ఏకంగా కోటి రూపాయలు వసూలైందట..

ఏ పుట్టిన రోజున అయినా ఎమ్మెల్యేలు సామాజికసేవలో పాలుపంచుకుంటారు. పేదలకు సాయం చేస్తుంటారు. పండ్లు, ఫలాలను రోగులకు అందిస్తుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం అవేమీ చేయకపోగా.. ఏకంగా జనాల దగ్గర కోటి వసూలు చేసుకొని సెలబ్రెటీ చేసుకున్న వైనం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇదే ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ‘వైఎస్ఆర్ జయంతి’ని పట్టించుకోకపోవడం వైసీపీ శ్రేణులను నివ్వెరపరిచింది. ఇప్పుడు తన బర్త్ డేను మాత్రం కోటి రూపాయలు వసూలు చేసి ఘనంగా చేసుకోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందట..

ఏపీ సీఎంగా గద్దెనెక్కగానే వైఎస్ జగన్ అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా ఉండాలని ఓ వైపు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇలా జల్సాల కోసం వసూళ్లు చేయడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *