ఉద్దానం కిడ్నీ సమస్య: మరో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టిన వైఎస్ జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకెళుతున్నారు. ఏడాది పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలను మన్నలను చురగొంటూ ముందుకెళుతున్నారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలపై దృష్టాసారించారు. ఇందులో భాగంగానే సీఎం జగన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారు. ఉద్దానంలో మంచినీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం త్వరగా పూర్తి చేయడం ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితులకు జగన్ సర్కార్ అండగా నిలువనుంది.

హంగు.. ఆర్భాటం లేకుండానే..
గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ ఉద్దానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించారు. ఉద్దానంలో శాశ్వత తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయటంతోపాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ. 700కోట్ల అంచనాలతో ఈ పథకాన్నిడిజైన్ చేసి రూ.530కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగులో రూ.527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభం..
ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ చేపడుతున్న మంచి నీటి పథకం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు ఎంఈఐఎల్ సన్నాహాలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపించనుంది. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ బాధితులుగా ఉన్న ప్రజల సమస్యను త్వరలో దూరం చేయనుంది. మేఘా సంస్థ ఇప్పటికే తాగునీటి రంగంలో అనేక ప్రపంచస్థాయి రికార్డులను నెలకొల్పింది. నిర్ణిత సమయంలో అతిపెద్ద ప్రాజెక్టులు పూర్తిచేసిన రికార్డు మేఘా పేరిట ఉంది. దీంతో ఈ పథకం కూడా నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ఏపీ ప్రభుత్వ అధికారులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

సుమారు 100 కిలోమీటర్ల నుంచి తాగునీరు…
ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు తాగునీటి అవసరాలకు ఎక్కువగా బోరు నీటిపై ఆధారపడుతున్నారు. ఈ ప్రాంత భూగర్భ జలాల్లో కిడ్నీ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్న కారకాలు ఉన్నట్టు నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్‌ నుంచి భూగర్భ పైపులైను ద్వారా నీటిని తరలించనుంది. మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తరలిస్తారు. వీటి ద్వారా ప్రతీ ఇంటికి ఈ నీటిని అందిస్తారు.

ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య..
దశబ్దాలుగా ఉద్దానంను పీడిస్తున్న సమస్యకు జగన్ సర్కార్ ఎట్టకేలకు మోక్షం ప్రసాదించనుంది. ఉద్దానంలో కిడ్నీ సమస్య 1985-86 ప్రాంతాల్లోనే బైటపడింది. 1990దశకంలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. దీంతో స్థానికంగా ఆందోళనలు చేపట్టారు. అయితే పాలకులు అప్పుడు ఈ సమస్యను తేలికగా తీసుకున్నారు. రోజురోజుకు కిడ్నీ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో నాటి పాలకులు తాత్కాలిక ఉపశమ చర్యలు తీసుకున్నారు. అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేశారు. అయితే ఆయన మరణంతో ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

ప్రచారానికే పరిమితమైన బాబు..
ఏపీలో 2014లో అధికారంలో వచ్చిన టీడీపీ ఈ సమస్యను ప్రచారానికే పరిమితం చేసింది. ఇక టీడీపీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017లో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించి ఎంతో హడావుడి చేశారు తప్ప సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయకపోవడం శోచనీయం. 2018 మే లో ఎచ్చెర్ల లో పవన్ కల్యాణ్ దీక్ష చేసి మరింత హడావుడి చేయగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సమావేశాలతో పనులు చేపడుతున్న ఆర్భాటం చేసి వదిలేశారు. ఇక 2017జనవరిలో అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖపట్నంలో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్య పై అధ్యయనానికి నిపుణుల బృందాన్ని పంపుతానని చెప్పారు. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు.

పరిష్కారం చూపని పరిశోధనలు..
ఇప్పటి వరకు హార్వర్డ్ విశ్వ విద్యాలయ బృందం, ఎన్జీఆర్ఐ, బాబా అణు పరిశోధనా కేంద్రం, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఐసీఎంఆర్, పలు ప్రైవేట్ సంస్థలు ఉద్దానం సమస్య పై అధ్యనం చేసాయి. అయితే ఏ ఒక్కరు కూడా సమస్యకు మూల కారణం మాత్రం కనుక్కోలేక పోయారు. ఉద్దానంలో ప్రతీ వంద మందిలో 35నుంచి 40మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే సమస్య తీవ్రత యెంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 17మొబైల్ కేంద్రాల ద్వారా ఉద్దానం విస్తరించి ఉన్న పలు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు పరీక్షలు చేశారు.

కిడ్నీ బాధితులకు అండగా జగన్ సర్కార్..
శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. 107 గ్రామాల్లో 1.3లక్షల జనాభాను పరీక్షిస్తే 14 వేల మంది కిడ్నీ బాధితులు తేలారు. కవిటి మండలం లో కిడ్నీ బాధితుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ఉద్దానం లో కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 10వేల మంది మరణించి ఉంటారని ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వారి అంచనా. ఉద్దానం పరిధిలోని ప్రతీ గ్రామం లో రెండు రోజులకు ఒకరు కిడ్నీ సమస్య తో మరణిస్తుంటారని ఓ అంచనా.

దశాబ్దాల గోసకు ఎట్టకేలకు మోక్షం..
వీటన్నింటిని పరిశీలించి సీఎం జగన్ సమస్యను తీవ్రతను గుర్తించారు. బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా జగన్ సర్కార్ మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. వీలైనంత త్వరగా మేఘా సంస్థ ఈ పథకాన్ని పూర్తి చేయడం ద్వారా దశాబ్దాలుగా ఉద్దానం బాధితులు అనుభవిస్తున్న బాధకు శాశ్వతంగా మోక్షం లభించనుండటంపై బాధిత గ్రామాల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *